HDFC Bank-Airtel | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో బ్లూచిప్ కంపెనీల్లో ఆరు కార్పొరేట్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,18,151.75 కోట్లు పెరిగింది. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ భారీగా లబ్ధి పొందాయి. గత వారం బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 354.23 పాయింట్లు (0.45శాతం), ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 77.8 పాయింట్లు (0.33 శాతం పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ భారీగా లబ్ధి పొందాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ నష్టాలతో ముగిశాయి. టీసీఎస్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, ఐటీసీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.15 లక్షల కోట్లు కోల్పోయాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 32,639.98 కోట్ల వృద్ధితో రూ.13,25,090.58 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.31,003.44 కోట్లు పుంజుకుని రూ.9,56,205.34 కోట్ల వద్ద నిలిచింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.29,032.08 కోట్లు పెరిగి రూ.5,24,312.82 కోట్ల వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,114.32 కోట్ల వృద్ధితో రూ.7,90,074.08 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.2,977.12 కోట్లు పెరిగి రూ.17,14,348.66 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.1,384.81 కోట్లు పుంజుకుని రూ.8,87,632.56 కోట్ల వద్ద ముగిసింది.
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.39,474.45 కోట్ల పతనంతో రూ.5,39,129.60 కోట్లతో సరిపెట్టుకుంది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.33,704.89 కోట్లు నష్టపోయి రూ.5,55,361.14 కోట్లకు పరిమితమైంది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.25,926.02 కోట్లు కోల్పోయి రూ.6,57,789.12 కోట్ల వద్ద నిలిచింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.16,064.31 కోట్లు నష్టపోయి రూ.14,57,854.09 కోట్ల వద్ద ముగిసింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.