IPO | స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపట్ల ఆసక్తి ఉన్న మదుపరులకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతగల అంశమే. ఎందుకంటే ఈ ఆఫర్లు అనేకానేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ పెద్ద ఎత్తున డిమాండ్ కారణంగా ఈ పబ్లిక్ ఇష్యూల్లో షేర్లను దక్కించుకోలేకపోతుంటారు చాలామంది. అందుకే కొన్నిరకాల మార్గాల్లో ప్రయత్నిస్తే మదుపరులు తాముల అనుకున్నది సాధించవచ్చు.
దేశీయ స్టాక్ మార్కెట్లు రోజుకో రికార్డు స్థాయిని తాకుతున్నాయి. ఒకప్పుడు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్పట్ల పెద్దగా ఆసక్తిచూపనివారే ఎక్కువ. కానీ ఇప్పుడు అంతా అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈక్విటీ పెట్టుబడులపై పెరిగిన అవగాహనే ఇందుకు కారణం. ఇక ఏదైనా సంస్థ ఐపీవోకు వచ్చినప్పుడు అందులో షేర్లను కొనాలనుకుంటే మీ కుటుంబ సభ్యులందరి పేర్లపైనా దరఖాస్తు చేసుకోవాలి. గడువులోగా ఈ పని పూర్తిచేయాలి. ఇతరత్రా విషయాలకొస్తే..
ఒకటికి మించి డీమ్యాట్ అకౌంట్ల ద్వారా పలుమార్లు దరఖాస్తు చేసుకోవడం వల్ల కూడా షేర్లను పొందవచ్చు. మీ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న డీమ్యాట్ ఖాతాలను ఇందుకు వాడుకోండి. దీనివల్ల రష్ ఎక్కువగా ఉన్నప్పటికీ దేనికో ఒకదానికి మీ షేర్ల అలాట్మెంట్ జరుగుతుంది. అయితే దరఖాస్తు సమయంలో మీకున్న అన్ని డీమ్యాట్ ఖాతాల వివరాలను పేర్కొనడం తప్పనిసరి.
ఐపీవో వచ్చినప్పుడు గంటల వ్యవధిలోనే రష్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సమయం ఉన్నదికదా అని ఆఖరు గంటదాకా వేచిచూడవద్దు. చాలావరకు ఐపీవోలు 2 నుంచి 5 రోజుల వ్యవధితో పబ్లిక్ ఇష్యూలకు వస్తూంటాయి. తొలిరోజే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. రోజులు గడుస్తున్నకొద్దీ సర్వర్లు హ్యాంగైపోవచ్చు. దీనివల్ల మీ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
దరఖాస్తు ఫారాల్లో బ్యాంక్/డీమ్యాట్ ఖాతాలు, ఇతరత్రా వివరాలను తప్పుగా పేర్కొనవద్దు. ఒకటికి రెండుసార్లు పరిశీలించి సరైన వివరాలనే ఇవ్వాలి. లేదంటే మీ అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతాయి. ఐపీవోల్లో చాలావరకు బిడ్లు ఇలానే పోతుంటాయి.
మాతృ సంస్థల్లో మీకు షేర్లున్నైట్టెతే వాటి అనుబంధ కంపెనీలు ఐపీవోలకు వచ్చినప్పుడు తప్పక దరఖాస్తు చేసుకోండి. మీ విశ్వసనీయత, దీర్ఘకాలిక అంకితభావం కారణంగా షేర్ల కేటాయింపుల్లో మీకు తొలి ప్రాధాన్యత దక్కగలదు. ఉదాహరణకు ఆర్ఐఎల్లో మీకు షేర్లున్నైట్టెతే ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న రిలయన్స్ జియో, రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ జ్యుయెల్లర్స్ సంస్థలు ఐపీవోలకు వస్తే వాటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
ప్రస్తుతం ఐపీవో మార్కెట్ సందడిగా ఉన్నది. అనేక రంగాల్లోని కంపెనీలు, స్టార్టప్‌లు నిధుల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. కాబట్టి ఈక్విటీ మార్కెట్లలో మదుపుపై ఆసక్తి ఉన్నవారు పెద్దపెద్ద సంస్థలను కాకుండా.. చిన్నచిన్న సంస్థలను ఎంచుకొంటే లాభదాయకం. నష్టాలు వాటిల్లినా పెద్దగా అవి మన పెట్టుబడులకున్న అవకాశాల్ని దెబ్బతీయవు.
ఐపీవోల్లో షేర్ల ధరల శ్రేణిని గమనించే ఉంటారు. రూ.70-75, రూ.150-160, రూ.500-515 ఇలా రకరకాల బ్యాండ్లలో ఈ ధరలను ప్రకటిస్తారు. ఇందులో మీరు గరిష్ఠ ధరలకు బిడ్డింగ్ చేసినప్పుడే మీకు షేర్లను దక్కించుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఉదాహరణకు ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.92-97 మధ్య ఉన్నది. అప్పుడు రూ.97కు షేర్లను కొంటామని మీరు బిడ్లను దాఖలు చేయాలి. తొలి ప్రాధాన్యతగా మిమ్మల్ని పరిగణిస్తారు.
ఐపీవోలో అలాట్మెంట్ దక్కాలంటే సింగిల్ లాట్కే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. అప్పుడే మీకున్న అవకాశాలు పెరుగుతాయి. సాధారణంగా చిన్న రిటైల్ మదుపరులను ప్రోత్సహించడానికి అలాట్మెంట్లలో వారికి తగిన ప్రాధాన్యాన్నిస్తారు. కనుక ఒక్క లాట్లోనే దరఖాస్తు చేసుకున్నవారికి ప్రయోజనం ఉంటుంది. ఒక్కో లాట్లో సాధారణంగా 100 షేర్లుంటాయి.