భారత్‌కు అమెరికా వంటగ్యాస్ పోటెత్తుతున్నది. పశ్చిమాసియా సంక్షోభం మొదలైన దగ్గర్నుంచి దేశంలోకి 2.2 మిలియన్ టన్నులకుపైగా ఎల్పీజీని అగ్రరాజ్యం దింపింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి, అక్కడ్నుంచి సరఫరా రెండింటికీ అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ట్రంప్ సర్కార్ ఈ దిగుమతులకు గట్టిగానే వసూలు చేస్తున్నది.
న్యూఢిల్లీ, జూలై 1: భారత్‌లోకి అమెరికా నుంచి వంటగ్యాస్ (ఎల్పీజీ) పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నది. దీంతో ఇప్పుడు దేశీయ ఎల్పీజీ దిగుమతుల్లో అగ్రరాజ్యం వాటానే ఎక్కువగా ఉన్నది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మనకొచ్చే వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిటైల్ మార్కెట్లో ధరల పెంపు, ఇతరత్రా ఆంక్షల్ని విధించిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలోనే ఎల్పీజీ దిగుమతులను తీవ్రతరం చేసిన కేంద్రం.. అమెరికా నుంచి అధిక ధరలైనా పెద్ద ఎత్తున కొంటున్నది. ఈ మేరకు గ్లోబల్ ట్రేడ్, షిప్పింగ్‌కు సంబంధించి రియల్-టైమ్ ట్రాకింగ్, మార్కెట్ ఇంటెలిజెన్స్ సేవల్ని అందించే డాటా, అనలిటిక్స్ కంపెనీ కెప్లర్ తెలియజేసింది. కాగా, అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, సహజ వాయువుల ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతున్నది.
ఇక కీలకమైన హొర్ముజ్ జలసంధి ఇప్పటికీ పూర్తిగా తెరుచుకోకపోవడంతో భారత్‌కు ఇంధన కష్టాలు కొనసాగుతున్నాయి. అయితే మునుపటితో పోల్చితే హొర్ముజ్‌లో పరిస్థితులు కొంతవరకు అనుకూలంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్నాయి. ఇది భారత్‌కు ఒకింత ఊరటగానే చెప్పుకోవచ్చు. కానీ దేశీయ డిమాండ్ దృష్ట్యా ధర ఎక్కువైనా, దూరం పెరిగినా.. ఎల్పీజీ దిగుమతులకు అమెరికానే దిక్కవుతున్నదని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. గల్ఫ్ సరఫరాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. భారతీయ రిఫైనరీలు అమెరికాతో చేసుకున్న ఒప్పందాల వల్ల అక్కడి నుంచే ఇక్కడికి మరికొంతకాలం ఎల్పీజీ రావచ్చని అంటున్నారు.
దేశీయ వంటగ్యాస్ అవసరాల్లో సుమారు 65 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో దాదాపు 90 శాతం పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుంది. అందులో యూఏఈ, సౌదీ అరేబియాలదే మెజారిటీ వాటా. అయితే యుద్ధం మొదలు (ఫిబ్రవరి 28) సీన్ మారిపోయింది. ఇప్పుడు అమెరికా నుంచే భారత్‌కు ఎక్కువగా వస్తున్నది. మార్చి 1 నుంచి ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్‌కు గరిష్ఠంగా 2.2 మిలియన్ టన్నులకుపైగా వంటగ్యాస్ దిగుమతైంది. అలాగే యూఏఈ నుంచి 6,13,041 టన్నులు, సౌదీ అరేబియా నుంచి 4,12,577 టన్నుల ఎల్పీజీ వచ్చింది.
పశ్చిమాసియాలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. గత నెలలో దేశంలోకి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతైంది. జూన్‌లో రోజుకు 4.93 మిలియన్ బారెళ్లు వచ్చిందని ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ గణాంకాలు చెప్తున్నాయి. రష్యా నుంచి దిగుమతులు పెరుగగా.. దాదాపు రోజుకు 2.6 మిలియన్ బ్యారెళ్లుగా నమోదైనట్టు సమాచారం. దీంతో భారత్‌కు అత్యంత ఎక్కువగా చమురును సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యానే మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. జూన్‌లో దేశంలోకి దిగుమతైన ముడి చమురులో సగానికిపైగా రష్యా నుంచే వచ్చింది మరి. అంతకుముందు నెల మేలో మొత్తం దిగుమతుల్లో 36.5 శాతంగానే ఉన్నాయి. అప్పుడు రష్యా నుంచి రోజుకు 2.13 మిలియన్ బ్యారెళ్లు దిగుమతయ్యాయి. కాగా, 2022-23 నుంచి భారత్‌కు ముడి చమురు రష్యా నుంచే ఎక్కువగా వస్తున్నది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో మెజారిటీ యూరోపియన్ దేశాలు రష్యా నుంచి క్రూడ్ ను కొనడం ఆపేశాయి. దీంతో రష్యా తక్కువ ధరలకే అమ్మగా.. భారతీయ రిఫైనరీలు భారీగా కొనుగోలు చేశాయి. అయితే అమెరికా ఆంక్షలతో తగ్గుముఖం పట్టినా.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల దృష్ట్యా మళ్లీ పెరిగాయి.
గల్ఫ్ దేశాల నుంచి గత 4 నెలలుగా భారత్‌కు వంటగ్యాస్ సరఫరాలో తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో దేశానికి ఎల్పీజీ సైప్లెలో అమెరికా అగ్రస్థానంలో నిలుస్తున్నది. అయితే దూరం పెరుగడంతో రవాణా వ్యయం భారంగా మారుతున్నది.
-సుమిత్ రితోలియా, కెప్లర్ సీనియర్ మేనేజర్