Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లు, మార్కెట్ వర్గాల అంచనాలను మిస్ అయింది. ఫలితంగా మంగళవారం మారుతి సుజుకి షేర్ 6.42 శాతం నష్టంతో ఇంట్రాడే ట్రేడింగ్ లో రూ.10,744.10 అతి కనిష్ట స్థాయి నమోదు చేసుకుంది. 2023-24తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో 17.4 శాతం తగ్గాయి. గతేడాదితో పోలిస్తే మారుతి సుజుకి స్టాండలోన్ నికర లాభాలు రూ.3,716.5 కోట్ల నుండి రూ.3,069.2 కోట్లకు పడిపోయాయి.
మారుతి సుజుకి ఆపరేషన్స్ ద్వారా సంపాదించిన ఆదాయం 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్వల్పంగా 0.4 శాతం పుంజుకుని రూ.37,062.1 కోట్ల నుంచి రూ.37,202.8 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ లాభాలు 7.7 శాతం తగ్గి రూ.4,784.20 కోట్లు (2023-24) నుంచి రూ.4,416.6 కోట్లకు పడిపోయాయి. గత మూడు నెలల్లో వాహనాల విక్రయాలు 3.9 శాతం తగ్గితే, ఎగుమతులు 12.1 శాతం పెరిగాయి. జూలై- సెప్టెంబర్ మధ్య కాలంలో 5,41,550 కార్లు విక్రయించింది మారుతి సుజుకి. వాటిలో దేశీయ మార్కెట్లో 4,63,834 యూనిట్లు విక్రయిస్తే, 77,716 యూనిట్ల కార్లు ఎగుమతి చేసింది.