Maruti Suzuki | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాస్త ఆదాయం ఉన్న వారు ఎంట్రీ లెవెల్ కార్ల నుంచి ఎస్యూవీ కార్ల కొనుగోలు కోసం మొగ్గు చూపుతున్నారు. గత కొంత కాలంగా ఎస్యూవీ వేరియంట్లపైనే మోజు పెంచుకుంటున్నారు. ఈ తరుణంలో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 22 లక్షల కార్లు ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఒకవైపు ఎస్యూవీ కార్ల మార్కెట్ విస్తరిస్తున్న వేళ.. మరోవైపు ఇతర కార్ల సంస్థలు మార్కెట్లో వాటా పెంచుకుంటున్న సమయంలో యుటిలిటీ కార్లు, ఎస్‌యూవీల ఉత్పత్తి పెంచాలని మారుతి సుజుకి తలపోస్తున్నది.
ఇప్పటికే వివిధ మోడల్ కార్లు.. ప్రత్యేకించి కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన మోడల్ కార్ల పట్ల కస్టమర్ల ఆకాంక్షలు.. కోరికలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. పలు మోడల్ కార్ల కోసం ప్రీ-బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ తరుణంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్ల సేల్స్‌లో 12 శాతం గ్రోత్ సాధించాలని భావిస్తున్నది. అదే జరిగితే వరుసగా మూడో సంవత్సరం కూడా కార్ల ఉత్పత్తిలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు కానున్నది.
దీనికి తోడు విడిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21 లక్షల కార్లు కస్టమర్లకు సరఫరా చేయాలని మారుతి సుజుకి ప్రణాళిక రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరంలో 19.6 లక్షల కార్లు డెలివరీ చేసింది. వీటిల్లో 2.79 లక్షల కార్లు విదేశాలకు ఎగుమతి చేసింది.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కార్ల మార్కెట్లో ఈ ఏడాది 5-7 శాతం లేదా 40.5 లక్షల కార్ల నుంచి 41 లక్షల కార్ల విక్రయం జరుగవచ్చునని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. కొత్తగా మార్కెట్లోకి ఆవిష్కరించిన ఎస్యూవీ కార్లు ఫ్రాంక్స్, జిమ్నీతోపాటు గ్రాండ్ విటారా మోడల్ కార్లతో మారుతి కార్ల సేల్స్ శరవేగంగా పెరుగుతాయని తెలిపారు.