హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ బిజినెస్): కార్ల విక్రయాల్లో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ .. హైదరాబాద్‌లో తన 3,500 అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. ప్రీమియం వాహనాలను విక్రయించడానికి వరుణ్ మోటర్స్ ఏర్పాటు చేసిన ఈ నెక్సా షోరూంను కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఎస్‌యూవీలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వచ్చే మార్చి నాటికి మరో రెండు కొత్త మోడళ్ళను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు రెండేండ్ల తర్వాత(2024-25 ఆర్థిక సంవత్సరం)లో దేశీయ మార్కెట్లోకి తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు, వ్యాపార విస్తరణలో భాగంగా ప్రతియేటా 150 నుంచి 200 అవుట్లెట్లను ప్రాంచైజ్ పద్దతిన నెలకొల్పబోతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో వచ్చే మార్చినాటికి రిటైల్ అవుట్లెట్ల సంఖ్య 3,700కి చేరుకోనున్నది. పదేండ్ల క్రితం కేవలం 1,300గా ఉన్న అవుట్లెట్లు ప్రస్తుతం మూడు రెట్లు పెరిగాయన్నారు.
ప్రస్తుతం సంస్థ ఏడాదికి 15 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తున్నది.
అరెనా, నెక్సా, కమర్షియల్ వాహనాలను విక్రయించడానికి ప్రత్యేక ఔట్లెట్లను నెలకొల్పింది.
దేశీయ జనాభాలో కేవలం 3% మంది మాత్రమే కార్లను వినియోగిస్తున్నారు.
దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి మారుతి సుజుకీ అడుగుపెట్టి 40 ఏండ్లు గడిచాయి.