న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్లోకి ఎట్టకేలకు ప్రవేశించింది. కిందటేడాది చివర్లో ప్రదర్శించిన తన తొలి ఎలక్ట్రిక్ మాడల్ ఈ-విటారాను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా నిర్ణయించింది. బాస్(బ్యాటరీ-యాస్-సర్వీసెస్) ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చును. ఇందుకోసం కొనుగోలుదారుడు అదనంగా కిలోమీటర్‌కు రూ.3.99 చొప్పున చెల్లించాల్సివుంటుంది. 61 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 543 కిలోమీటర్లు ప్రయాణించనుండగా, 49 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన మాడల్ 440 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
ఆన్‌లైన్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద రూ.21 వేలు చెల్లించి ముందస్తుగా ఈ కారును బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపింది. ఇందుకోసం సంస్థ 1,100 నగరాల్లో 2 వేల చార్జింగ్ పాయింట్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
మారుతి చరిత్రలో ఇదొక కీలక మైలురాయి వంటిదని, ఎలక్ట్రిక్ రంగంలో తొలి అడుగుపడిందని, భవిష్యత్తులో ఈ సెగ్మెంట్ మరింత బలోపేతం అయ్యే అవకాశాలున్నాయని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. గడిచిన రెండేండ్లలో ఈవీ మార్కెట్ 4-5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందన్నారు. ఈ కారును ఇప్పటికే విదేశాల్లో సుజుకీ మోటర్ కార్పొరేషన్‌తో కలిసి విక్రయిస్తున్నది.