న్యూఢిల్లీ, మార్చి 17: దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, టాటా మోటర్స్ తమ వాహనాల ధరల్ని వచ్చే నెల నుంచి పెంచబోతున్నట్టు సోమవారం ప్రకటించాయి. ఇప్పటికే ఈ ఏడాది ధరల్ని ఒకసారి పెంచిన కంపెనీలు.. మరోసారి పెంచాలని చూస్తుండగా, పెరిగిన తయారీ ఖర్చులు, నిర్వహణ వ్యయాల దృష్ట్యా తప్పట్లేదని చెప్తున్నాయి. ఇదిలావుంటే ఏప్రిల్ నుంచి తమ కార్ల ధరలు మాడల్నుబట్టి 4 శాతం వరకు పెరుగుతాయని మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. టాటా మోటర్స్ కూడా తమ వాణిజ్య వాహనాల ధరలు 2 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది.
నిజానికి కస్టమర్లపై ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించాలని వీలైనంతదాకా కంపెనీయే భరిస్తున్నదని, అయినప్పటికీ ఎంతోకొంత కొనుగోలుదారులపై భారం వేయక తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలియజేసింది. ఇక ఈ ఏడాది జనవరిలో కార్ల ధరల్ని మాడల్నుబట్టి రూ.32,500 వరకు మారుతీ పెంచింది. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ప్రారంభ స్థాయి మాడల్‌గా ఆల్టో కే-10ను మారుతీ అమ్ముతున్నది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.4.23 లక్షలుగా ఉన్నది. అలాగే మారుతీ కార్లలో గరిష్ఠ ధర రూ.29.22 లక్షలు. ఇదిలావుంటే వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచే యోచనలో ఉన్నామని హోండా కార్స్ ఇండియా కూడా చెప్తున్నది. అయితే హ్యుందాయ్ మోటర్ ఇండియా మాత్రం ఈ విషయంలో ఇప్పుడే స్పందించేందుకు నిరాకరించింది.