న్యూఢిల్లీ, జూన్ 5: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే మూడేండ్లకాలంలో పునరుత్పాదకత విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.450 కోట్ల నిధులు ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను సౌర విద్యుత్ ప్లాంట్లు, బయోగాస్ ప్లాంట్ కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. 2023-24లో సంస్థ రూ.120.8 కోట్ల నిధులను ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, 2030-31 నాటికి 40 మిలియన్లకు పెంచడానికి సంస్థ కృత నిశ్చయంతో ఉన్నదని మారుతి సుజుకీ ఎండీ, సీఈవో హిసాషి తకేచి తెలిపారు. దీంట్లో భాగంగానే ఈ ఏడాది మానెసర్ ప్లాంట్లో బయోగ్యాస్ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.