ముంబై, ఆగస్టు 22: మ్యూచువల్ ఫండ్స్‌ల్లో మహిళా మదుపరుల భాగస్వామ్యాన్ని పెంచడంపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తొలిసారి పెట్టుబడులు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలను పరిచయం చేసే యోచనలో ఉన్నట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. శుక్రవారం ఇక్కడ భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పాండే మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో అందర్నీ భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని, పురుషులతో సమానంగా మహిళలూ ప్రాతినిథ్యం వహించాలని, వారిపాత్ర లేనిదే ‘ఫైనాన్షియల్ ఇంక్లూజన్’ అసంపూర్తిగా ఉంటుందన్నారు.
అందుకే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టే మహిళల్ని ప్రోత్సహించాలని చూస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే అదనపు ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్టు వివరించారు. నిజానికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి చేయూత ఇవ్వడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇటీవలే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తొలిసారి పెట్టుబడులకు ముందుకొచ్చే ఇన్వెస్టర్లను పెంచడానికి డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహకాలను ప్రతిపాదించినట్టు గుర్తుచేశారు.
దేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను మరింత పారదర్శకంగా, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు పాండే తెలియజేశారు. సంప్రదింపుల ప్రక్రియ కింద వస్తున్న అభిప్రాయాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోర్ట్‌ఫోలియో స్కీముల్లో ఓవర్లాప్ సమస్యను పరిష్కరించి, సరికొత్త ప్రొడక్ట్స్ వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. ఇదిలావుంటే రిటైల్ ఇన్వెస్టర్లు, అమాయక మదుపరుల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా సెబీ పలు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విదితమే. స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నది. అయినప్పటికీ మోసగాళ్ల బారినపడి చిన్న మదుపరులు నష్టపోతూనే ఉండగా, చట్టాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మోసపూరిత ట్రేడింగ్ పథకాలతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సెబీ హెచ్చరించింది. వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల సందేశాలు, మొబైల్ అప్లికేషన్ల (యాప్స్) ద్వారా విదేశీ పోర్ట్‌ఫోలియో లేదా సంస్థాగత మదుపర్ల ముసుగులో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తామని, ఆకర్షణీయ రాబడులను అందిస్తామని చెప్తే నమ్మవద్దని ఓ ప్రకటనలో సూచించింది. ఐపీవోల్లో కచ్ఛితమైన అలాట్మెంట్లు ఇస్తామని, డిస్కౌంట్ ధరలకే షేర్లను కొనుక్కోవచ్చని అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కోరింది. అమాయక మదుపరులే లక్ష్యంగా మోసగాళ్లు ఈ తరహా తప్పుడు ప్రకటనలు చేస్తారని వివరించింది. సెబీ నమోదిత ఇంటర్మీడియరీస్ ఆఫర్ చేసే విశ్వసనీయ ట్రేడింగ్ యాప్స్‌నే వినియోగించాలని స్పష్టం చేసింది.