న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 : స్టాక్ మార్కెట్ల భీకరనష్టాలతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌లను విధించడానికి సిద్ధమవుతుండటంతో దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి. గడిచిన ఎనిమిది రోజుల్లో దేశీయ ప్రామాణిక మార్కెట్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 2,644.6 పాయింట్లు లేదా 3.36 శాతం పడిపోయింది. మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 810 పాయింట్లు లేదా 3.41 శాతం జారుకున్నది. దీంతో మదుపరులకు చెందిన లక్షల కోట్ల సంపద హారతికర్పూరంలా కరిగిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకుంటుండటం, కార్పొరేట్ల నిరుత్సాహాక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధంపై అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో ఈక్విటీలు కుదేలయ్యాయి.
దీంతో గత ఎనిమిది సెషన్లలో మదుపరులు రూ.25.31 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.25,31,579.11 కోట్లు కరిగిపోయి రూ.4,00,19,247 కోట్లు(4.61 ట్రిలియన్ డాలర్లకు) పడిపోయింది. మదుపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ముఖ్యంగా విదేశీ నిధులు తరలిపోవడం ఈ ఆందోళనను మరింత పెంచుతున్నదని మెటా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సీ తెలిపారు. డిసెంబర్ త్రైమాసికంలో కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందన్నారు. అలాగే వారాంతం ట్రేడింగ్ శుక్రవారం కూడా సెన్సెక్స్ 199.76 పాయింట్లు, నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయాయి.
దేశీయ ఫార్మా రంగం కుప్పకూలుతున్నది. విదేశాల నుంచి దిగుమతయ్యే ఏ వస్తువుపైన దిగుమతి సుంకాన్ని విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇతర దేశాలు అతలాకుతలమవుతున్నాయి. దీంట్లోభాగంగా అమెరికా మార్కెట్‌పై అత్యధికంగా ఆధారపడుతున్న దేశీయ ఫార్మా సంస్థలకు ఇది కోలుకోలేని దెబ్బ. దీంతో హెల్త్‌కేర్ రంగానికి చెందిన షేర్లు కుప్పకూలుతున్నాయి. గత ఐదు రోజుల్లో ఆరు శాతం వరకు హెల్త్‌కేర్ ఇండెక్స్ నష్టపోయింది. ఒకవేళ ట్రంప్ ఫార్మా ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తే అమెరికాలో ఔషధ ధరలు పెరిగే అవకాశాలుంటాయని ఫార్మా ప్రతినిధి ఒకరు తెలిపారు.