ముంబై, జనవరి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. భారత్‌పై మరోసారి సుంకాలను మోపనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ, రిలయన్స్తోపాటు ఐటీ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి.
ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 322.39 పాయింట్లు కోల్పోయి 85,439.62 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ సైతం నష్టపోయింది. ఇంట్రాడేలో రికార్డు స్థాయి 26,373.20 పాయింట్లకు చేరుకున్న నిఫ్టీ చివరకు ఈ లాభాలను నిలుపుకోలేకపోయింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపరులను నష్టాలవైపు నడిపించాయి. ఫలితంగా నిఫ్టీ 78.25 పాయింట్లు కోల్పోయి 26,250.30 వద్ద ముగిసింది. నిఫ్టీ చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ మదుపరులు చివర్లో ప్రాఫిట్ బుకింగ్ మొగ్గుచూపడంతో తన కీలక మైలురాయి 26, 200ని అధిగమించిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. వెనెజువెలాపై అమెరికా దాడులు చేస్తుండటంతో ప్రపంచ మార్కెట్ల లో అలజడి నెలకొన్నదని, ఫలితంగా మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారని జియోజిట్ ఫైనాన్షియల్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.