Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం వరుసగా ఎనిమిదో రోజు మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఉదయం లాభాల్లో మొదలైనా.. చివరకు నష్టాలు తప్పలేదు. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,541.77 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం వరకు మళ్లీ కోలుకున్నా కొద్దిసేపటికే మళ్లీ తగ్గాయి. ఇంట్రాడేలో 80,677.82 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,201.15 పాయింట్లకు చేరింది.
చివరకు 97.32 పాయింట్లు తగ్గి.. 80,267.62 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 23.80 పాయింట్లు తగ్గి 24,611.10 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 1,970 షేర్లు లాభపడగా.. 1,939 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రికల్, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. ఇక ఇంటర్‌గ్లోబ్ ఏవీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్స్సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఆటో, లార్సెన్ నష్టపోయాయి.