Stocks | నిరంతరాయంగా విదేశీ మదుపర్లు నిధులు విత్‌డ్రా చేయడంతో బ్లూ చిప్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో సెషన్లో బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 112.16 పాయింట్లు (0.15శాతం) నష్టపోయి 73,085.94 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 73,649.72పాయింట్ల గరిష్టం నుంచి 72,784.54 పాయింట్ల కనిస్ట స్థాయికి పతనమైంది.
ఇక, మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ వరుసగా తొమ్మిదో రోజు నష్టాలతో ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 5.40 పాయింట్ల పతనంతో 22,119.30 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 120 పాయింట్లు పతనమై 22,004.70 పాయింట్లకు పడిపోయింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకి ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ తదితర స్టాక్స్ నష్టపోయాయి. మరోవైపు ఆల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టర్బో, ఎస్బీఐ తదితర స్టాక్స్ లాభ పడ్డాయి.
ఆసియా మార్కెట్లలో టోక్యో, హాంకాంగ్ లాభాలతో ముగిస్తే, షాంఘై నష్టాలతో స్థిర పడింది. సియోల్ స్టాక్ మార్కెట్‌కు సోమవారం సెలవు. యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా స్థిర పడ్డాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.58 శాతం తగ్గి 72.89 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.