Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీల్లో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, క్రూడాయిల్ (Crude Oil) ధరలు తగ్గుముఖం పట్టడంతో మన మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, రియల్టీ, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దాంతో స్టాక్ మార్కెట్లో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లయ్యింది.
సెన్సెక్స్ 443 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 140 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ ఉదయం 76,545.21 పాయింట్లు (క్రితం ముగింపు 76,478.67) వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. రోజంతా సూచీలు లాభాల్లోనే కదలాడాయి. ఇంట్రాడేలో 77,110.08 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి సెన్సెక్స్ 443.97 లాభంతో 76,922.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.10 పాయింట్ల లాభంతో 24,005.85 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నెల్, ఏషియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాలు చవిచూశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.23 ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.34 డాలర్లుగా ఉండగా.. బంగారం ఔన్సు 3,987 డాలర్ల వద్ద కొనసాగుతోంది.