Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల తర్వాత మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జూన్ నెలలో భారత దేశ ద్రవ్యోల్బణం 77 నెలల కనిష్ట స్థాయి 2.1శాతానికి తగ్గింది. ఈ క్రమంలో మార్కెట్లో అన్నిరంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 82,233.16 ఫ్లాట్‌గా మొదలైంది. ఈ తర్వాత కోలుకొని లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో 82,221.74 పాయింట్ల కనిష్టానికి పెరిగిన సెన్సెక్స్.. గరిష్టంగా 82,743.62 పాయింట్లకు చేరింది. చివరకు సెన్సెక్స్ 317.45 పాయింట్లు పెరిగి 82,570.91 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 113.50 పాయింట్లు పెరిగి 25,195.80 వద్ద ముగిసింది. అన్ని రంగాల సూచీలు ఫార్మా, ఆటో, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ 0.5-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు ఒకశాతం పెరిగాయి. హీరో మోటోకార్ప్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్ నిఫ్టీలో ప్రధానంగా లాభాలను నమోదు చేశాయి.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎటర్నల్, టాటా స్టీల్ నష్టపోయాయి. విస్తరణ ప్రణాళిక నేపథ్యంలో హీరో మోటోకార్ప్ షేర్లు 5 శాతం పెరిగాయి. ర్యాలీస్ ఇండియా షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. క్యూ 1లో లాభం దాదాపు రెట్టింపు అయిన విషయం తెలిసిందే. తేజస్ నెట్వర్క్స్ షేర్లు క్యూ 1లో నష్టాల నేపథ్యంలో షేర్లు 6 శాతం పడిపోయాయి. యూఎస్ పేటెంట్ సెటిల్మెంట్ లెక్సెల్వి ప్రారంభానికి మార్గం సుగమం కావడంతో సన్ ఫార్మా షేర్లు దాదాపు 3శాతం పెరిగాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి ఆర్డర్లతో రైల్‌టెల్ కార్పొరేషన్ షేర్లు 2 శాతం పెరిగాయి. టాటా టెక్నాలజీస్ షేర్లు జూన్ త్రైమాసికంలో నికర లాభం 5శాతం పెరగడంతో షేర్లు 2 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 140 స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరాయి. ఇందులో ఆథమ్ ఇన్వెస్ట్మెంట్, నిప్పాన్ లైఫ్, హెచ్డీఎఫ్ ఏఎంసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్, జిల్లెట్ ఇండియా, యూటీఐ ఏఎంసీ, పిరమల్ ఎంటర్ప్రైజెస్, అనుపమ్ రసాయనన్, లారస్ ల్యాబ్స్, ఈఐడీ ప్యారీ, గ్లోబల్ హెల్త్, సియట్, జేఎం ఫైనాన్షియల్ ఉన్నాయి.