Investers Wealth | ఆటో, బ్యాంకు స్టాక్స్ పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 821 పాయింట్ల నష్టంతో స్థిర పడటంతో మంగళవారం ఇన్వెస్టర్ల సంపద రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయింది. త్రైమాసిక ఫలితాల్లో కార్పొరేట్ సంస్థల నామమాత్రపు లాభాలు, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, ఏషియన్, యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో బలహీన ధోరణులతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 820.97 పాయింట్ల నష్టంతో 78,675.18 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితంగా మదుపర్ల సంపదగా భావిస్తున్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,29,525.42 కోట్లు నష్టపోయి రూ.4,37,24,562.57 కోట్ల (5.18 లక్షల కోట్ల డాలర్లు) కు పడిపోయింది.
బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ లో ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, జేఎస్ డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. మరోవైపు ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్0 లాభ పడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) సోమవారం రూ.2,306.88 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. ఏషియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్, ఈయూ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వాల్ స్ట్రీట్ మార్కెట్ లాభాలతో స్థిర పడింది.