Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్ గా ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 71.77 పాయింట్ల నష్టం (0.09 శాతం)తో 82,890.94 పాయింట్లతో సరిపెట్టుకుంటే, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 32.40 (0.13 శాతం) పాయింట్ల నష్టంతో 25,356.50 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో 32 స్టా్క్స్ నష్టాల్లో కొనసాగాయి. ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్; ఐటీసీ, కోల్ ఇండియా స్టాక్స్ 1.65 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు విప్రో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, గ్రాసిం తదితర స్టాక్స్ 3.78 శాతం వరకూ లాభాలు గడించాయి. బీఎస్ఈలో అదానీ పోర్ట్స్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, మారుతి సుజుకితోపాటు 19 స్టాక్స్ నష్టపోయాయి. బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు తదితర 11 స్టాక్స్ లాభాలతో పుంజుకున్నాయి.
విప్రో నాలుగు శాతం పుంజుకోగా, నిఫ్టీ మిడ్ క్యాప్-100 తాజాగా 52 వారాల గరిష్టాన్ని తాకింది. స్పైస్ జెట్, బంధన్ బ్యాంక్ స్టాక్స్ తాజా గరిష్టం నమోదు చేశాయి. బంగారం ధరలు పెరగడంతో జ్యువెల్లరీ స్టాక్స్ పుంజుకున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ మీద రూపాయి మారకం విలువ రూ.83.90 వద్ద ముగిసింది. ఇక గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 72.71 డాలర్ల వద్ద తచ్చాడుతోంది.
గురువారం తొలిసారి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 83 వేల మార్కును దాటేసి 83,116.19 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 1439.55 పాయింట్ల లబ్ధితో 82,962.71 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 25,433.35 పాయింట్ల ఆల్ టైం ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.7695 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.