Stocks | సంవత్ 2080 చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు గురువారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నెగెటివ్ గా ముగిశాయి. ప్రత్యేకించి ఐటీ సూచీలు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణంగా నిలిచాయి. దీపావళి నేపథ్యంలో శుక్రవారం ఒక గంట పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ముహురత్ ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తారు. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 553.12 పాయింట్లు పతనమై 80 వేల దిగువన 79,389.06 పాయింట్లకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ బాటలోనే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 135.50 పాయింట్ల పతనంతో 24,305.35 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50లోని 34 స్టాక్స్ నష్టాలతోనే ముగిశాయి. హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ లతోపాటు ఏషియన్ పెయింట్స్ 3.61 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు సిప్లా, లార్సెన్ అండ్ టర్బో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రాతోపాటు 16 స్టాక్స్ 9.50 శాతం వరకూ లాభాలతో ముగిశాయి. ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.15 శాతం పుంజుకున్నది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.03 శాతం నష్టపోయింది. మీడియా, ఫార్మా, హెల్త్ కేర్ మినహా అన్ని ఇండెక్సులు ఒక శాతానికి పైగా షేర్ నష్టపోయాయి.