Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 337 పాయింట్ల నష్టంతో 57,900 పాయింట్ల వద్ద స్థిర పడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 111 పాయింట్ల పతనంతో 17,043 పాయింట్లతో సరిపెట్టుకున్నది. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలు గడించినా.. కొద్దిసేపటికే ఇండెక్స్‌లు నష్టాల్లో పడిపోయాయి. మధ్యాహ్నం ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించినా నిలవలేక పోయాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో ఏడు మినహా 23 స్టాక్స్ నష్టాల్లోనే ముగిశాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) పతనం ప్రభావం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నది. ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.82.48 వద్ద ముగిసింది.
చాలా రోజుల తర్వాత అదానీ గ్రూప్‌లోని 10 స్టాక్స్ నష్టాలను చవి చూశాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 7.70 శాతం, అదానీ పోర్ట్స్ 4.07, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ షేర్లు ఐదు శాతం చొప్పున నష్టపోయాయి. ప్రత్యేకించి అదానీ టోటల్ గ్యాస్, అదానీట్రాన్స్మిషన్, అదానీ పవర్, ఎన్డీటీవీ ఇంట్రాడే ట్రేడ్‌లో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 0.67 శాతం, అంబుజా సిమెంట్స్ 3.91, ఏసీసీ సిమెంట్స్ 1.58 శాతం నష్టాలతో ముగిశాయి.
ఇక ఎన్ఎస్ఈ-50లో 38 స్క్రిప్ట్‌లు నష్టాలతో ముగిశాయి. వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో స్టాక్స్ నష్టాలతో సరిపెట్టుకున్నాయి. టైటాన్, బీపీసీఎల్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు కూడా నష్టపోయాయి.
ఎన్ఎస్ఈలోని 11 సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో తొమ్మిది నష్టాలతో ముగిశాయి. పీఎస్‌యూ ఇండెక్స్ గరిష్టంగా 1.90 శాతం, ఐటీ, మెటల్, రియాల్టీ సెక్టార్లు ఒక శాతానికి పైగా, బ్యాంక్, ఆటో, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్ ఒక్కోశాతం చొప్పున నష్టపోయాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో టైటాన్, భారతీ ఎయిర్టెల్, ఎల్&టీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్క్రిప్ట్‌లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కొటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ నష్టపోయాయి.