Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్ ఎగుమతి చేసే వస్తువులపై అమెరికా అదనపు సుంకాలు బుధవారం నుంచి అమలు కానున్నాయి. ఇప్పటికే 25శాతం సుంకాలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా 25శాతం సుంకాలు విధించగా.. బుధవారం (ఆగస్టు 27 నుంచి ) 50శాతానికి చేరనున్నాయి. ఈ క్రమంలో సుంకాల ఆందోళనల నేపథ్యంలో మార్కెట్లు ఒకశాతానికిపైగా పడిపోయాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. 81,377.39 వద్ద నష్టాల్లో మొదలైంది. సుంకాల ఆందోళన నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇంట్రాడేలో 81,450.28 పాయింట్ల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,685.98 పాయింట్లకు పడిపోయింది.
చివరకు 849.37 పాయింట్ల నష్టంతో 80,786.54 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 255.70 పాయింట్లు తగ్గి 24,712.05 వద్ద స్థిరపడింది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు తగ్గి 87.69 వద్ద ముగిసింది. మార్కెట్లు దాదాపు 1,167 షేర్లు లాభపడగా.. 2,751 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్ నష్టపోగా.. ఐషర్ మోటార్స్, హెచ్‌యూఎల్, మారుతి సుజుకి, నెస్లే ఇండియా, ఐటీసీ లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ మినహా మిగతా అన్నిరంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, టెలికాం ఒకటి నుంచి రెండుశాతం వరకు తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.3శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.7 శాతం తగ్గాయి.