Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా ఐదో రోజు బేర్’చూపులు చూశాయి. ద్వితీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాల నేపథ్యంలో విదేశీ ఇన్వె్స్టర్లు వాటాల విక్రయానికి పూనుకోవడంతో సెంటిమెంట్ బలహీన పడింది. దీంతో వరుసగా నాలుగో వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గతేడాది ఆగస్టు తర్వాత వరుసగా నాలుగు వారాలు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగియడం ఇదే తొలిసారి. ఐదు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏడు శాతానికి పైగా నష్టప్యాయి.
శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 662.87 పాయింట్ల పతనంతో 79,402.29 పాయింట్లకు పరిమితమైంది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 218.63 పాయింట్లు నష్టపోయి 24,180.80 పాయింట్ల వద్ద స్థిర పడింది. బీఎస్ఈ-30లోని 20 ఇండెక్స్‌లు, ఎన్ఎస్ఈ-50లోని 38 ఇండెక్సులు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 18.99 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్ సంస్థలు రెండు శాతం చొప్పున పతనం అయ్యాయి. మరోవైపు ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, హెచ్ యూఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్ సీఎల్ టెక్ సంస్థలు 2.2 శాతం లాభ పడ్డాయి.
బ్రాడర్ మార్కెట్లలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.48 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 2.4 శాతం నష్టంతో ముగిశాయి. గత ఏడు సెషన్లలో స్టాక్ మార్కెట్లలో సర్దుబాట్లతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు దాదాపు తొమ్మిది శాతం పతనం అయ్యాయి. బేర్ గుప్పిట్లో చిక్కుకున్న బీఎస్ఈలో దాదాపు 3087 స్టాక్స్ నష్టపోగా, 856 స్టాక్స్ పుంజుకున్నాయి. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.433.7 లక్షల కోట్లకు చేరుకున్నది.