Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 585 పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ 203 పాయింట్లు పతనమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాల నేపథ్యంలో మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అమెరికా సుంకాల అమలును మరో వారం పొడిగించిన నేపథ్యంలో మార్కెట్ల నష్టాల్లో మొదలైంది. చివరి వరకు కోలుకోలేకపోయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,074.41 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,317.51 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,495.57 కనిష్టానికి తగ్గింది.
చివరకు 585.67 పాయింట్ల నష్టంతో 80,599.91 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 203 పాయింట్లు పతనమై.. 24,565.35 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1264 షేర్లు లాభపడగా.. 2582 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్, సిప్లా నష్టపోయాయి. లాభపడిన వాటిలో ట్రెంట్, ఆసియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, హెచ్‌యూఎల్, నెస్లే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ మినహా, అన్ని ఇతర రంగాల సూచీలు ఆటో, రియాల్టీ, ఫార్మా, ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, టెలికాం 0.5-2 శాతం క్షీణించి నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.6 శాతం దాకా తగ్గాయి.