Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్లు లాభాల్లో ట్రేడయినా.. చివరి వరకు కొనసాగించలేకపోయాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు చివరి సెషన్లో నష్టాల్లోకి జారుకున్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,540.74 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 83,850.09 గరిష్టానికి పెరిగిన సెన్సెక్స్.. 83,850.09 పాయింట్ల కనిష్టానికి చేరింది. చివరకు 170.22 పాయింట్లు పతనమై.. 83,239.47 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 48.10 పాయింట్లు తగ్గి 25,405.30 వద్ద ముగిసింది. అమెరికా, వియత్నాం వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో సానుకూల పవనాలతో భారత మార్కెట్లు సైతం లాభాల్లో మొదలయ్యాయి.
తొలి అర్ధభాగంలో నిఫ్టీ 25,600 పాయింట్లకు చేరింది. అయితే, చివరి గంటలో మదుపరుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడేలో వచ్చిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. అపోలో హాస్పిటల్స్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, మారుతి సుజుకీ నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే మెటల్, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, టెలికాం సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం క్షీణించాయి. ఫార్మా, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్ 0.3-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్‌తో కలిపి విస్తృత సూచీలు వరుసగా మూడో సెషన్లో క్షీణించాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ రెండురోజుల పతనాన్ని అధిగమించి 0.5 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 140కి పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరాయి.