Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్లు మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. క్రితం సెషన్లో పోలిస్తే సెన్సెక్స్ 80,625.28 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 80,489.86 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 80,751.18 పాయింట్లకు చేరింది. చివరకు 57.75 పాయింట్ల లాభంతో 80,597.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 11.95 పాయింట్ల లాభంతో 24,631.30 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం పతనం కాగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం తగ్గింది.
ఈ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కొక్కటి ఆరు వారాల వరుస నష్టాలను చవిచూశాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి. మళ్లీ సోమవారం యథావిధిగా కొనసాగనున్నాయి. విప్రో, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ నిఫ్టీలో లాభపడ్డాయి. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర షేర్లు నష్టపోయాయి. మెటల్, చమురు, గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతం, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ ఒక్కొక్కటి 0.5శాతం తగ్గాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీరంగాల షేర్లు ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి.
ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు దాదాపు 10 శాతం పెరిగాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ షేర్లు 2.5శాతం పెరిగాయి. వెర్సెంట్ గ్రూప్‌లో 75 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత ఇన్ఫోసిస్ లాభపడింది. జూన్ త్రైమాసికంలో బలమైన ఆదాయాలపై ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ షేర్లు 3శాతం జెరిగాయి. ముత్తూట్ ఫైనాన్స్, క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్, విశాల్ మెగా మార్ట్, ఎటర్నల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అనుపమ్ రసాయన్, ఢిల్లీవరీ, ఎంఅండ్ఎం, అపోలో హాస్పిటల్స్, హ్యుందాయ్ మోటార్, సాయి లైఫ్ సైన్సెస్, టీవీఎస్ మోటార్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ వంటి వంద కంటే ఎక్కువ స్టాక్‌లు బీఎస్ఈలో 52వారాల గరిష్టాన్ని తాకాయి.