Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. మార్కెట్లో ఐటీ మినహా ఇతర సూచీలు నష్టాల్లో కొనసాగాయి. ఫలితంగా మార్కెట్లు పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,869.47 స్వల్ప లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 81,890.15 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యల్పంగా 81,427.01 పాయింట్లకు పడిపోయింది.
చివరకు 212.85 పాయింట్లు పతనమై.. 81,583.30 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 93.10 పాయింట్లు దిగజారి.. 24,853.40 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,443 షేర్లు లాభపడ్డాయి. 2,384 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, ఎటర్నల్, ఓఎన్జీసీ నష్టపోగా.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, మారుతి సుజుకీ లాభాల్లో కొనసాగాయి. ఐటీ మినహా, ఫార్మా, మెటల్, ఆయిల్, గ్యాస్, ఆటో, రియాలిటీ, పీఎస్‌యూ బ్యాంక్ 0.5-2 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి.