దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ట్రంప్ జోష్ కలిసొచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడం ఖాయంగా కనిపించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక్కో శాతానికి పైగా వృద్ధి చెందాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 901.50 పాయింట్లు (1.13 శాతం) లాభంతో 80,378.13 పాయింట్లకు చేరుకున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 270.74 పాయింట్లు (1.12 శాతం) వృద్ధి చెంది 24,484.05 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ-50లో 41 స్టాక్స్ లాభాలు గడించాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌సీఎల్ టెక్, విప్రో 5.33 శాతం వరకూ పుంజుకున్నాయి.
మరోవైపు ఎస్బీఐ లైఫ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ట్రెంట్‌తోపాటు తొమ్మిది స్టాక్స్ నష్టపోయాయి. బ్రాడ్ ఇండెక్సులు నిఫ్టీ మిడ్ క్యాప్-100, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 రెండు శాతానికి పైగా వృద్ధి చెందాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.99 శాతం వృద్ధి చెందితే, కేంద్ర ముడి చమురు సంస్థలు, కన్జూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ ఇండెక్స్‌లు రెండు శాతానికి పైగా లాభ పడ్డాయి.