Market Capitalization | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,07,366.05 కోట్లు పెరిగింది. వీటిలో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంకు భారీగా లబ్ధి పొందాయి. సంవత్ 2081 ప్రారంభం సందర్భంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో మూరత్ ట్రేడింగ్ నిర్వహించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 321.83 పాయింట్ల లబ్ధి పొందింది. మూరత్ ట్రేడింగ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) లాభ పడ్డాయి. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ నష్టాలతో ముగిశాయి.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.36,100.09 కోట్లు పెరిగి రూ.7,32,755.93 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంకు ఎం- క్యాప్ రూ.25,775.58 కోట్లు పుంజుకుని రూ.9,10,686.85 కోట్లకు చేరింది.భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,887.74 కోట్లు వృద్ధి చెంది రూ.5,88,509.41 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.15,393.45 కోట్ల వృద్ధితో రూ.18,12,120.05 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.10,671.63 కోట్లు పెరిగి రూ.6,13,662.96 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.2,537.56 కోట్లు పుంజుకుని రూ.5,96,408.50 కోట్ల వద్ద నిలిచింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,054.43 కోట్ల నష్టంతో రూ.7,31,442.18 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.27,299.54 కోట్ల పతనంతో రూ.9,20,299.35 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.26,231.13 కోట్లు నష్టంతో రూ.14,41,952.60 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.3,662.78 కోట్లు నష్టపోయి రూ.13,20,076.65 కోట్లకు చేరుకున్నది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లోని టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఇన్ఫోసిస్, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఎల్ఐసీ నిలిచాయి.