హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ల సంస్థ..హైదరాబాద్‌లో ఆభరణాల తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామని వెల్లడించారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక పాలసీలను మార్చుకోలేదని.. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
మలబార్ గ్రూపు చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ.. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఈ నిధులను అంతర్గత వనరులు, పలు బ్యాంకుల వద్ద రుణం తీసుకున్నట్టు చెప్పారు. ఏటా 4.7 టన్నుల బంగారు ఆభరణాలు, 1.8 లక్షల క్యారెట్ల డైమండ్ ఆభరణాలతోపాటు 78 టన్నుల గోల్డ్ రిఫైనింగ్ సామర్థ్యం ఈ ప్లాంట్ కలిగివున్నదన్నారు. ప్రస్తుతం సంస్థకు 13 దేశాల్లో 400కి పైగా షోరూంలను నిర్వహిస్తున్నది.