న్యూఢిల్లీ, ఏప్రిల్ 6:ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మహీంద్రాఅండ్ మహీంద్రా..దేశీయ మార్కెట్‌కు మరో నూతన బ్రాండ్‌ను పరిచయం చేయబోతున్నది. ఓజా బ్రాండ్‌తో 40 నూతన మాడళ్లను ఒకేసారి తీసుకురాబోతున్నది. తక్కువ బరువు కలిగిన ఈ బ్రాండ్‌ను భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కైట్లెన అమెరికా, జపాన్, ఆసియాలోని పలు దేశాల్లోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
నాలుగు విభాగాల్లో విడుదల చేయనున్న ఈ ట్రాక్టర్లు.. సబ్-కాంప్యాక్ట్, కాంప్యాక్ట్, చిన్న, అతిపెద్ద యుటిలిటీకి సంబంధించి 40 మాడళ్లను వివిధ హెచ్పీల్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ సరికొత్త ట్రాక్టర్లను తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్‌లోనే తయారు చేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు. ఇప్పటికే ఈ యూనిట్లో యువో, జివో ట్రాక్టర్లతోపాటు ప్లస్ సిరీస్ ట్రాక్టర్లను తయారు చేస్తున్నది. ఏడాదికి లక్ష యూనిట్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ కెపాసిటీని మరింత పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశీయంగా కంపెనీకి సంబంధించిన ట్రాక్టర్లకు ఉన్న డిమాండ్ ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు.