Edible Oils | కరోనా మహమ్మారి తర్వాత వంట నూనెల ధరలు ఎంత మాత్రమూ దిగి రానంటున్నాయి. ఒకవైపు దేశీయంగా.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల రైతులు వేరు శనగ నుంచి లాభదాయకమైన పంట పత్తి వైపు మళ్లడం.. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలు కావడంతో సన్‌ఫ్లవర్ ఆయిల్, పామోలిన్ ధరలు ఆకాశాన్ని తాకేలా బరబరా పెరిగిపోవడం దీనికి కారణాలని చెబుతున్నారు.
గతేడాది ఏప్రిల్‌లో పామోలిన్ ఎగుమతులను నిషేధిస్తూ ఇండోనేషియా నిర్ణయం తీసుకున్నది. ఫలితంగా భారత్‌తోపాటు వివిధ దేశాల్లో పామోలిన్ సరఫరాకు కొరత ఏర్పడింది. ప్రజల నుంచి వచ్చే గిరాకీకి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో పామోలిన్ ధర పెరిగిపోతున్నది. భారత్‌కు ప్రతి నెలా రెండు మిలియన్ టన్నుల పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. ఇది ప్రపంచవ్యాప్త వ్యాపారంలో 50 శాతం. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగితే దాని ధర పెరుగుతుందని ఇండ్-రా సంస్థ అధ్యయనంలో తేలింది.
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా రైతులు వేరు శనగ పంట సాగు నుంచి తప్పుకుంటున్నారు. దీనికి బదులు పత్తి సాగు వైపు మళ్లుతున్నారు. కేఎల్-1812 వెరైటీ వేరుశనగను ప్రోత్సహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వంట నూనెలకు కొరత ఏర్పడిన వేళ.. కే-6 వెరైటీ వేరు శనగ నుంచి వచ్చే 48 శాతం ఆయిల్‌తో పోలిస్తే, కేఎల్-1812 వెరైటీ వంగడంతో 51 శాతం ఆయిల్ వస్తుందని ప్రచారం జరిగింది. ఇక వేరు శనగ విత్తనాలకు ప్రభుత్వ సబ్సిడీ కూడా పడిపోయింది. 2021లో 2.3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేస్తే, గత ఖరీఫ్ సీజన్లో 1.8 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది.
దీనికి తోడు పత్తిపై క్వింటాల్‌కు రూ.20 వేల పరిహారం ఇస్తున్న ఏపీ సర్కార్.. క్వింటాల్ వేరు శనగపై కేవలం రూ.1800 మాత్రమే అందిస్తున్నది. ఫలితంగా వేరు శనగ రైతులు దానికి బదులు పత్తి సాగు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెరిగిపోయిన వంట నూనెల ధరలను తగ్గించడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నా. దిగి రావడం లేదని చెబుతున్నారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కూడా దేశీయంగా సన్‌ఫ్లవర్ నూనె కొరతకు కారణం అని చెబుతున్నారు. ఆ రెండు దేశాల నుంచే దేశీయ అవసరాలకు దిగుమతి చేసుకుంటున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ 90 శాతం ఉంటుంది. యుద్ధం వల్ల ఆ రెండు దేశాల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి తగ్గుదల ప్రభావం మార్కెట్లో కొరతకు.. అటుపై ధరల పెరుగుదలకు దారి తీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీపైనా, చివరకు వినియోగదారులపైన పడుతుందని అంటున్నారు.