ముంబై, అక్టోబర్ 17 : దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడోరోజూ సూచీలు కోలుకోలేకపోయాయి. గురువారం ఒక్కరోజే మదుపరుల సంపద రూ.6 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. ఉదయం ఆరంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 494.75 పాయింట్లు లేదా 0.61 శాతం దిగజారి 81,006.61 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 21 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఇక ఒకానొక దశలోనైతే 595.72 పాయింట్లు పడిపోయి సెన్సెక్స్ 80,905.64కు చేరింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 221.45 పాయింట్లు లేదా 0.89 శాతం దిగి 24,749.85 వద్ద స్థిరపడింది.
బేరిష్ ట్రెండ్ నేపథ్యంలో ప్రధాన రంగాల షేర్లేవీ కూడా మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ నష్టాలకే పరిమితమయ్యాయి. విదేశీ మదుపరులు తమ పెట్టుబడుల ఉపసంహరణలకే పెద్దపీట వేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే మార్కెట్లకు నష్టాలు తప్పలేదని మెజారిటీ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. బుధవారం విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) రూ.3,435.94 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారని స్టాక్ ఎక్సేంజ్ గణాంకాలు చెప్తున్నాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలూ నష్టాల్లోనే ఉన్నాయి.
బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.6,03,862.06 కోట్లు కరిగిపోయి రూ.4,57,25,183.01 కోట్ల (5.44 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. సెన్సెక్స్ షేర్లలో నెస్లే అత్యధికంగా 3 శాతానికిపైగా క్షీణించింది. మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లూ నిరాశపర్చాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 1.65 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.42 శాతం పతనమయ్యాయి. రంగాలవారీగా రియల్టీ 3.76 శాతం, ఆటో 3.48 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.28 శాతం, కమోడిటీస్ 1.77 శాతం, చమురు-గ్యాస్ 1.54 శాతం నష్టపోయాయి.
ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించడం, ఎఫ్ఐఐలు పెట్టుబడులను అదేపనిగా వెనక్కి తీసుకుంటుండటం, ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికిగాను ప్రధాన సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తుండటం మార్కెట్ వరుస నష్టాలకు దారితీస్తున్నది.
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా తీసుకొచ్చిన భారీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఎట్టకేలకు విజయం సాధించింది. మూడు రోజుల ఈ పబ్లిక్ ఇష్యూ.. గురువారంతో ముగియగా, ఆఖరి రోజున ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. రూ.27,870 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ నెల 15 (మంగళవారం)న మొదలైన ఈ ఐపీవోకు తొలి రెండు రోజుల్లో 42 శాతం సబ్‌స్క్రిప్షనే వచ్చింది. అయితే చివరి రోజు మదుపరులు పోటెత్తడంతో మొత్తంగా 2.37 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయ్యింది. ఈ మేరకు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఫలితంగా ఇప్పటిదాకా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ.21,000 కోట్ల ఐపీవో పేరిట ఉన్న అతిపెద్ద ఐపీవో రికార్డు.. ఇప్పుడు హ్యుందాయ్ సొంతమైంది. కాగా, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) నుంచి అధిక డిమాండ్ రావడం వల్లే హ్యుందాయ్ ఐపీవో సక్సెస్ అయ్యింది. షేర్ల కోసం 6.97 రెట్లు ఎక్కువగా బిడ్డింగ్ వేశారు. రిటైల్ ఇండివీడ్యువల్ ఇన్వెస్టర్ల నుంచి 50 శాతం, నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 60 శాతం సబ్స్క్రిప్షన్ వచ్చింది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,315 కోట్ల నిధులను హ్యుందాయ్ సమీకరించిన సంగతి విదితమే.