న్యూఢిల్లీ/ముంబై, మే 31: ఈసారి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?.. బీజేపీ మళ్లీ సొంతంగా మెజారిటీ సీట్లను గెల్చుకుంటుందా?.. లేదా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతుతో మూడోసారి గద్దెనెక్కుతుందా?.. లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిదే అధికారమా?.. ఇవి.. ఇప్పుడు యావత్తు దేశం మదిలో మెదులుతున్న ప్రశ్నలు. నెలన్నర రోజులుగా సాగిన లోక్‌సభ ఎన్నికల తంతు.. శనివారంతో ముగిసింది. ఇప్పుడు అందరి చూపు మంగళవారం వెలువడే ఫలితాలపైనే. దేశీయ స్టాక్ మార్కెట్లదీ ఇంతే. అవును.. కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ప్రభావం.. ఈక్విటీ మార్కెట్లపై కచ్ఛితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గతకొద్ది రోజులుగా తీవ్ర ఒడిదొడుకుల మధ్య పడుతూ, లేస్తూ సాగుతున్న సూచీలే ఇందుకు నిదర్శనం. అందుకే ఫలితాల అనంతర పరిణామాలపై మార్కెట్ నిపుణుల నుంచి రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే.. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి, ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతాయన్న అంచనాలే అధికం. కాగా, బిజినెస్ టుడే సర్వే ప్రకారం.. బీజేపీ సొంతంగా 300-320 సీట్లు గెల్చుకోవచ్చని స్టాక్ మార్కెట్ల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 303 సీట్లు గెల్చుకోగా, మొత్తం ఎన్డీఏ కూటమికి 352 సీట్లు దక్కిన సంగతి విదితమే.
ఈసారి ఎన్నికల్లో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి 300ల కంటే తక్కువ సీట్లు వచ్చినా మార్కెట్లపై ఆ ప్రభావం పెద్దగా ఉండదు.
-ఉమేశ్‌కుమార్ మెహెతా, సామ్కో అసెట్ మేనేజ్మెంట్
ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపోటములు రూపీ విలువను, బాండ్ ఈల్డ్స్‌ను చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ ప్రభావితం చేయబోవు.
-విజయ్ శర్మ, పీఎన్బీ గిల్ట్స్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు
2019 మెజారిటీని మించి ఈసారి బీజేపీ విజయాన్ని దక్కించుకుంటే.. ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతాయి. పాలసీపరమైన జోషే ఇందుకు కారణం.
-రాజేశ్ భాటియా, ఐటీఐ మ్యూచువల్ ఫండ్ సీఐవో
రూపాయి విలువ, బాండ్ ఈల్డ్స్ కొంత రికవరీ అయ్యే వీలున్నది. బీజేపీ గెలుపు.. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువను షార్ట్ టర్మ్‌లో దాదాపు 82.80 స్థాయికి బలపర్చగలదు.
-వీఆర్సీ రెడ్డి, కరూర్ వైశ్యా బ్యాంక్ ట్రెజరీ అధిపతి
మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుని 272 సీట్లనే బీజేపీ గెల్చుకుంటే.. మార్కెట్లు ఒడిదొడుకులకు లోను కావచ్చు. అయితే మళ్లీ తేరుకుని సూచీలు పరుగులు పెట్టడం ఖాయం.
-జేమ్స్ థామ్, ఏషియన్ ఈక్విటీస్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్
బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి ఈసారి అధికారంలోకి రాకపోతే స్టాక్ మార్కెట్లు 20 శాతానికిపైగా పడిపోవచ్చు. తిరిగి పుంజుకోవడానికి చాలా సమయమే పడుతుంది. కనుక మదుపరులు తమ పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని కనబర్చాలి. రకరకాల సాధనాల్లోకి పెట్టుబడులను మళ్లిస్తే ఒడిదొడుకులను తట్టుకోవచ్చు.
-జితేంద్ర గోహిల్, కొటక్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజర్స్ సీఐఎస్
ఈసారి బీజేపీ ఓడిపోతే దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కనీసం 25-30 శాతం పడిపోవచ్చు. అయితే ప్రస్తుత ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వచ్చినా లాభాల స్వీకరణల మధ్య మార్కెట్ కరెక్షన్కూ వీలుంటుందనిపిస్తున్నది. ఏదిఏమైనా 10 శాతం నష్టాలు తప్పవని చెప్పవచ్చు.
-దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న ఓ మదుపరి