న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జీవిత బీమా సంస్థలు నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్లలో భారీ వృద్ధి నమోదైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను నూతన ప్రీమియం వసూళ్లు 5.1 శాతం ఎగబాకి రూ.3.97 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాది ఇది రూ.3.77 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంట్లో వ్యక్తిగత నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్లు రూ.1.49 లక్షల కోట్ల నుంచి రూ.1.66 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
బీమా సంస్థల్లో అగ్రగామి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) రూ.2.26 లక్షల కోట్ల నూతన బిజినెస్ ప్రీమియాన్ని వసూలు చేసింది. దీంట్లో రూ.62,404.58 కోట్లు వ్యక్తిగత నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్లు కావడం విశేషం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ 1.78 కోట్ల నూతన పాలసీలను విక్రయించింది.