న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) షేర్ అదరగొట్టింది. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ బీమా రంగ షేర్లు మాత్రం కదంతొక్కాయి. దీంట్లో బీమా దిగ్గజం ఎల్ఐసీ షేర్ 10 శాతం వరకు లాభపడింది. స్టాక్ మార్కెట్లో లిైస్టెన తర్వాత ఇంతటి భారీ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంట్రాడేలో 10 శాతానికి పైగా లాభపడిన బీఎస్ఈలో కంపెనీ షేర్ మార్కెట్ ముగిసే సమయానికి 9.69 శాతం ఎగబాకి రూ.677.65 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలోనూ షేర్ 9.71 శాతం లాభపడి రూ.677.70 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.37,855.12 కోట్లు పెరిగి రూ.4,28,613.47 కోట్లకు చేరుకున్నది. బీఎస్ఈలో 16.53 లక్షల షేర్లు చేతులు మారగా..అటు ఎన్ఎస్ఈలో 1.89 కోట్ల షేర్లు చేతులు మారాయి. వచ్చే కొన్ని నెలల్లో 3 నుంచి 4 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ఎల్ఐసీ చైర్మన్ సిద్దార్థ మోహంతీ ఇటీవల వ్యాఖ్యానించడం షేర్ ధర దూసుకుపోవడానికి దోహదం చేసింది. దేశీయ జీవిత బీమా వ్యాపారంలో ఎల్ఐసీ 58.50 శాతం వాటా కలిగివున్నది. మరోవైపు, బీమా రంగ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్ 18 శాతం లాభపడగా, న్యూ ఇండియా అస్యూరెన్స్ షేరు 20 శాతం ఎగబాకింది.
నష్టపోయిన సూచీలు
వరుసగా రెండోరోజు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి. ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. కానీ, బ్యాంకింగ్ రంగ సూచీలు కోలుకోవడం భారీ నష్టాలను తగ్గించుకోగలిగాయి. ఒకదశలో 200 పాయింట్ల స్థాయిలో నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 47.77 పాయింట్లు నష్టంతో 65,970.04 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 7.30 పాయింట్లు తగ్గి 19,794.70 వద్ద ముగిసింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 175.31 పాయింట్లు, నిఫ్టీ 62.9 పాయింట్లు బలపడింది. వారాంతం ట్రేడింగ్‌లో హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, నెస్లె, టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్ షేర్లు నష్టపోగా..యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కొటక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.