ముంబై, ఏప్రిల్ 19: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ అదరకొట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పాలసీల విక్రయాల్లో దూకుడును ప్రదర్శించింది. నిమిషానికి 41 పాలసీల చొప్పున 2021-22లో ఏకంగా 21,718,695 బీమా పాలసీలను విక్రయించింది. అంతక్రితం ఏడాది విక్రయించిన 20,975.439 పాలసీల కంటే 3.54 శాతం అధికం ఇది. ఒక్క మార్చి నెలలోనే అత్యధికంగా 4,896,019 పాలసీలను విక్రయించింది. మార్చి 2021లో విక్రయించిన 4,667,952 కంటే ఇది 4.89 శాతం అధికం. అలాగే మార్కెట్ వాటాలో కూడా 74.51 శాతం నుంచి 74.60 శాతానికి చేరుకున్నట్లు గతేడాదికిగాను సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత నాన్-సింగిల్ ప్రీమియం వసూళ్ళు రూ.27,584.02 కోట్ల నుంచి 8.82 శాతం అధికమై రూ.30,015.74 కోట్లకు చేరుకున్నాయి. అలాగే తొలి ఏడాది ప్రీమియం కింద రూ.1,98,759.85 కోట్లు వసూలయ్యాయని తెలిపింది. అంతక్రితం ఏడాది వసూలైన రూ.1,84,174.57 కోట్లతో పోలిస్తే 7.92 శాతం అధికం. అలాగే వ్యక్తిగత సింగిల్ ప్రీమియం వసూళ్ళు మాత్రం 61 శాతం అధికమై రూ.2,495.82 కోట్ల నుంచి రూ.4,018.33 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. గ్రూపు సింగిల్ ప్రీమియం వసూళ్ళు కూడా 48 శాతం అధికమై రూ.30 వేల కోట్లకు చేరుకున్నాయి. మార్కెట్ వాటాలోనూ ఎల్ఐసీ జోరు కొనసాగింది. బీమా రంగంలోకి ప్రైవేట్ సంస్థలు అడుగుపెట్టినప్పటికీ ఎల్ఐసీ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. మొత్తం తొలి ఏడాది ప్రీమియం వసూళ్ళలో 63.25 శాతం మార్కెట్ వాటా కలిగివున్నది.