న్యూఢిల్లీ, మే 27: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థలో మరింత వాటాను అమ్మేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్నది. వచ్చే నెల జూన్ ఆఖర్లో లేదా ఆపై నెల జూలై ఆరంభంలో దాదాపు 2 శాతం వాటాను సంస్థాగత మదుపర్లకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వ యోచిస్తున్నది. కాగా, ఈ వాటా అమ్మకంతో రూ.10,000 కోట్లు ఖజానాకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ లావాదేవీ నిర్వహణకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ.. గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, బీఎన్పీ పరిబాస్ ఎస్ఏ, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్‌తో కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఇష్యూ తేదీ, పరిమాణం వివరాలు రానున్నాయి.
2022 మే నెలలో ఎల్ఐసీలోని 3.5 శాతం వాటాను అమ్మేసి.. కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థను దేశీయ స్టాక్ మార్కెట్లలోకి తీసుకొచ్చింది. అప్పట్లో దేశీయ అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)గా అది రికార్డుల్లోకెక్కింది. ఈ పబ్లిక్ ఇష్యూలో సుమారు రూ.21,000 కోట్లను సమీకరించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎల్ఐసీలో కేంద్రానికి ఇంకా 96.5 శాతం వాటా ఉన్నది. అందులో మరో 2 శాతాన్ని అమ్మేయాలనుకుంటున్నది. అయితే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకారం.. 2032 మే నెలకల్లా ఎల్ఐసీలో కనీసం 25 శాతం వాటాను పబ్లిక్ షేర్‌హోల్డింగ్ చేయాల్సి ఉన్నది. దీంతో వచ్చే 8 ఏండ్లలో మరో 19-20 శాతం వాటాను ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తప్పక వదులుకోవాల్సి ఉంటుంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న విషయం తెలిసిందే. దీంతో పబ్లిక్ ఇష్యూలకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బేరిష్ ట్రెండ్‌తో ఆశించిన రీతిలో నిధుల సమీకరణ సాధ్యం కాకపోవచ్చన్న భయాలున్నాయి మరి. కాగా, మార్కెట్ మళ్లీ బుల్ రన్‌ను సంతరించుకుంటే ఎల్ఐసీలో వాటాల విక్రయాన్ని కేంద్ర వేగిరం చేయవచ్చన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
వచ్చే నెలలో ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం 2 శాతం వాటాను అమ్మబోతున్నదన్న వార్తలు.. స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. ఈ క్రమంలోనే బుధవారం ట్రేడింగ్‌లో ఒకానొక దశలో 3 శాతానికిపైగా నష్టపోయాయి. మధ్యాహ్న సమయంలో 3.29 శాతం నష్టాన్ని సూచిస్తూ రూ.827.40 వద్ద ఎల్ఐసీ షేర్ విలువ కదలాడింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నా.. 2.89 శాతం క్షీణించి నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లో రూ.830.20 వద్ద ముగిసింది. మంగళవారం రూ.854.90 వద్ద స్థిరపడిన సంగతి విదితమే.
పశ్చిమాసియాలో సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే.. బీమా రంగంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్ దొరైస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దెబ్బకు ప్రజల ఆదాయం పడిపోయే వీలుందని, ఇదే జరిగితే బీమా రంగానికి కష్టకాలమేనన్నట్టు స్పందించారు. ‘మనం ఇప్పుడు చాలా కష్ట సమయాల్లో ఉన్నాం. ఇప్పటికే ప్రధాని మోదీకి ఈ విషయాన్ని తెలియజేశాం. నిజానికి పశ్చిమాసియా సంక్షోభం పూర్తి ప్రభావం మనపై ఇంకా పడలేదు. ఈ విషయంలో భారత్ ఎంతో స్థితిస్థాపకతను ప్రదర్శించింది’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే మరికొంతకాలం మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగితే ప్రజల పొదుపు, ఖర్చులు ప్రభావితం కాగలవని హెచ్చరించారు. ఇది బీమా రంగానికి, దేశ ఆర్థిక వ్యవస్థకూ మంచి సంకేతం కాదన్నారు.
ఎల్ఐసీ బుధవారం పునరుద్ధరించిన జీవన్ సాథీ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ పాలసీతో పొదుపు, రక్షణ రెండూ పాలసీదారులకు అందుతాయి. ఇక జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం అంటూ రెండు ప్లాన్లను ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్ దొరైస్వామి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ రెండూ కూడా జాయింట్ లైఫ్ ప్లాన్లు. వివాహమైతే ఒకే పాలసీలో పాలసీదారు, వారి భాగస్వామి ఇరువురికీ ప్లాన్ కవరేజీ ఉంటుందన్నమాట. కనీస బీమా రూ.3 లక్షలు. ఆపై ఎంత మొత్తానికైనా బీమా తీసుకోవచ్చు. అయితే కంపెనీ బోర్డు నిబంధనలకు లోబడే గరిష్ఠ పరిమితి ఉంటుందని ఓ ప్రకటనలో ఎల్ఐసీ తెలిపింది. ఇక ఈ పాలసీలకు 18 ఏండ్లు నిండినవారే అర్హులు.