LIC Results | ఇటీవలే దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. ఎల్ఐసీ నికర లాభం తగ్గుముఖం పట్టింది. 2020-21తో పోలిస్తే 2021-22 మార్చి త్రైమాసికంలో 18 శాతం నికర లాభం తగ్గిపోయి, రూ.2371 కోట్లతో సరిపెట్టుకున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ ఆదాయం 11.64 శాతం దూసుకెళ్లింది.
2020-21 నాలుగో త్రైమాసికంలో ఎల్ఐసీ రెవెన్యూ రూ.1,89,176 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.2,11,471 కోట్లకు పెరిగింది. 2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 39.4 శాతం పెరిగి రూ.2,900.56 కోట్ల నుంచి రూ.4,043.12 కోట్లకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ తన వాటాదారులకు 1.50 చొప్పున డివిడెండ్ సిఫారసు చేసింది.
ఇటీవలే దేశీయ స్టాక్ మార్కెట్లోకి లిస్టయిన ఎల్ఐసీ ఐపీవోలో మూడురెట్లు ఎక్కువగా సబ్స్క్రిప్షన్ అయ్యింది. అలా లిస్టయినప్పుడు ఇష్యూ ధర కంటే 15 శాతానికి పైగా నష్టపోయింది. ఈ నెల 17న దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. సోమవారం ఎల్ఐసీ షేర్లు 1.89 శాతం లాభ పడ్డాయి.