ముంబై, జూన్ 3 : ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నిర్ణయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) జారీ చేసిన రూ.5,000 కోట్ల విలువైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ)ను ఎల్ఐసీ పూర్తిగా సబ్‌స్ర్కైబ్ చేయడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది. గతంలోనూ అదానీ గ్రూప్ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం.. హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంచలన రిపోర్టుతో స్టాక్ మార్కెట్లలో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలడం.. ఎల్ఐసీ పెట్టుబడుల విలువ సగానికిపైగా పడిపోవడంతో సర్కారీ బీమా సంస్థ వ్యవహార శైలిపై అంతా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ అదానీ పోర్ట్స్ ఎన్సీడీలను మొత్తానికి మొత్తం కొనడం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూప్ సంస్థలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తుందన్న విమర్శలూ వచ్చిన సంగతి విదితమే. అదానీ గ్రూప్ సంస్థల్లోకి దేశ, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు, ఆయా దేశాలతో జరిగిన ఒప్పందాలూ చర్చనీయాంశమైయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద సంస్థాగత మదుపరిగా ఉన్న ఎల్ఐసీ.. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులపట్ల అమితాసక్తిని కనబర్చడం వెనుక కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీసెజ్ ఎన్సీడీలను మొత్తంగా కొనేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది.
అదానీ సంస్థల్లో విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) క్రమేణా తమ వాటాలను తగ్గించుకుంటున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీలో ఎఫ్ఐఐ వాటాలు 3 నెలల్లో 13.68 శాతం నుంచి 12.45 శాతానికి దిగజారాయి. తగ్గిన పెట్టుబడుల విలువ రూ.1,850 కోట్లు. అలాగే ఏపీసెజ్‌లో 13.93 శాతం నుంచి 13.42 శాతానికి తగ్గితే.. అంబుజా సిమెంట్స్‌లో 0.54 శాతం, ఏసీసీలో 0.31 శాతం మేర తగ్గాయి. వీటన్నిటి విలువ మరో రూ.2,120 కోట్లు, అదానీ ఎంటర్ప్రైజెస్లోనూ రూ.54 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంగా రూ.4,024 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించారు. అయితే ఎల్ఐసీ మాత్రం పెట్టుబడులను పెడుతూపోతున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన 10 అదానీ కంపెనీల్లో అదానీ విల్మర్, ఎన్డీటీవీ, అదానీ పవర్ మినహా అన్నింట్లో ఎల్ఐసీ పెట్టుబడులున్నాయి మరి. వీటి విలువ రూ.50,000 కోట్లపైనేనని అంచనా.
అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలోని సామాన్య ప్రజల సొమ్మును.. ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పనంగా దోచిపెడుతున్నారంటూ దుయ్యబట్టారు. ‘పైసలు, పాలసీ, ప్రీమియం మీవి.. భద్రత, సౌకర్యం, లాభం అదానీవి’ అంటూ ఎల్ఐసీ పాలసీదారులనుద్దేశించి మంగళవారం రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
నిధుల సమీకరణకు ఆయా కంపెనీలు జారీ చేసేవే ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ). ఇవి ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు. ఈ డిబెంచర్లకు ఈక్విటీ షేర్లలోకి మార్చుకొనే సౌకర్యం ఉండదు. నిర్ణీత కాలవ్యవధితో ఉంటాయి. ఈ మొత్తం కాలవ్యవధికి ఒకే రకమైన నిర్ధిష్ట వడ్డీరేటు ఉంటుంది. అదానీ పోర్ట్స్ ఇప్పుడు తెచ్చిన ఎన్సీడీ కాలపరిమితి 15 ఏండ్లు. దేశీయంగా ఇటీవలికాలంలో ఇంత దీర్ఘకాల కార్పొరేట్ బాండ్లను అదానీ గ్రూప్ జారీ చేయడం ఇదే తొలిసారి. దీనిపై వార్షిక వడ్డీరేటు 7.75 శాతం ఆఫర్ చేసింది. మూలధన వ్యయం, సాధారణ కార్పొరేట్ అవసరాలు, రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిధులను అదానీ గ్రూప్ వినియోగించుకోనున్నది. కాగా, ఈ ఏడాది మార్చి 31నాటికి ఏపీసెజ్ నికర రుణ భారం రూ.36,422 కోట్లుగా ఉన్నది.
Also Read : మళ్లీ పెరిగిన పసిడి..! తులం రూ.99వేలకు..!
రెండోరోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..! అమ్మకాల ఒత్తిడితో డౌన్..!