Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. రూపాయి బలహీనపడడంతో పుత్తడి ధర ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రూ.70 పెరిగి తులానికి రూ.99వేలకు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. అదే సమయంలో 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.98,600కి పెరిగింది. మరో వైపు వెండి ధర సైతం స్వల్పంగా ఎగిసింది. రూ.100 పెరిగి కిలోకు రూ.1,00,200కి చేరుకుంది. అమెరికా డాలర్ బలపడడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో రూపాయి పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు తగ్గి 85.60 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 25.22 డాలర్లు తగ్గి ఔన్స్‌కు 3,356.41 డాలర్లకు చేరింది.
లాభాల స్వీకరణకు దిగుతుండడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కమోడిటీ అండ్ కంపెనీ రీసెర్చ్ ఈబీజీ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మీర్ పేర్కొన్నారు. యూఎస్ డాలర్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధం కారణంగా పెరుగుతున్న అనిశ్చిత మధ్య బంగారం పెట్టుబడులు సానుకూలంగానే ఉన్నాయి. పెట్టుబడిదారులు యూఎస్ స్థూల ఆర్థిక డేటా, ఉద్యోగ డేటా కోసం ఎదురు చూస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లోని కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. వ్యాపారులు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సభ్యుల ప్రసంగాలపై నిఘా ఉంచారని.. ఇవి బులియన్ ధరలను ప్రభావితం చేస్తాయన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల ధర రూ.90,800 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.99,060 వద్ద ట్రేడవుతున్నది.