LIC M-Cap | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) షేర్లు గురువారం ఆరు శాతానికి పైగా పుంజుకున్నాయి. దీంతో ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6.99 లక్షల కోట్లకు పెరిగింది. బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్-10 సంస్థల్లో ఐదో సంస్థగా నిలిచింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఎల్ఐసీ స్టాక్ 5.86 శాతం వృద్ధి చెంది రూ.1,106.25 వద్ద సెటిలైంది. అంతర్గత ట్రేడింగ్‌లో 9.51 శాతం వరకూ పెరిగి రూ.1,144.45లతో రికార్డు గరిష్టానికి దూసుకెళ్లింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీలో ఎల్ఐసీ షేర్ 6.46 శాతం వృద్ధి చెంది రూ.1,112 వద్ద స్థిర పడింది. తద్వారా ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,740.62 కోట్లు పెరిగి రూ.6,99,702.87 కోట్లకు చేరుకున్నది.
దీంతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ను దాటేసి ఐదో స్థానానికి చేరుకున్నది ఎల్ఐసీ. అంతకుముందు అంతర్గత ట్రేడింగ్‌లో ఎల్ఐసీ షేర్ రూ.1,144.45లకు దూసుకెళ్లడంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.23 లక్షల కోట్లకు వరకూ చేరుకుని.. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.6.99 లక్షల కోట్లకు పడిపోయింది.
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,64,044.94 కోట్లకు చేరుకున్నది. తర్వాతీ స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.15,13,218.99 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.10,66,150.51 కోట్లకు, ఇన్పోసిస్ ఎం-క్యాప్ రూ.7,02,754.66 కోట్లకు, ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.6,99,702.87 కోట్లకు చేరింది.
గత నెలలో అత్యంత విలువైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా నిలిచిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)ని ఎల్ఐసీ దాటేసింది. 2022 మే నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ లిస్టయింది. ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా ఎల్ఐసీలో ప్రభుత్వం 22.13 (3.5 శాతం) కోట్లకు పైగా తన షేర్లను విక్రయించింది. ఎల్ఐసీలో ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. సోమవారం ఎల్ఐసీ షేర్ దాదాపు ఆరు శాతం పుంజుకుని తొలిసారి రూ.1000 మార్క్‌ను దాటింది. ఇక ఏడాది కాలంలో ఎల్ఐసీ షేర్ సుమారు 33 శాతం వృద్ధి చెందింది.