న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజాల్లో ఒకటైన ఎల్జీ అనుబంధ సంస్థయైన ఎల్జీ ఇండియా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది కూడా. ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.15 వేల కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నది. దీంతో ఈ ఏడాది వచ్చిన ఐపీవోల్లో ఇదే అతిపెద్దది కానుండటం విశేషం.
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సంస్థ.. అక్టోబర్ నెల తొలి వారంలోనే సరైన సమయమని భావిస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గతేడాది డిసెంబర్లో సెబీకి దరఖాస్తు చేసుకున్న సంస్థకు ఈ ఏడాది మార్చిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో వాయిదాపడుతూ వచ్చిన వాటా విక్రయం చివరి దశకు చేరుకున్నదని కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.
దేశీయ సబ్సిడరీ సంస్థల్లో 15 శాతం లేదా 10.2 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించాలనుకుంటున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన రెండో అతిపెద్ద కొరియా కంపెనీగా ఎల్జీ నిలువనున్నది. మరోవైపు, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 30 సంస్థలు ఐపీవోకి రాగా, మొత్తంగా రూ.60 వేల కోట్ల నిధులను సమీకరించాయి. ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద ఐపీవోల్లో హెచ్డీఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.12,500 కోట్ల నిధులను సేకరించింది. దీంతోపాటు వచ్చేకొన్ని నెలల్లో టాటా క్యాపిటల్ రూ.17,200 కోట్ల నిధులు సమీకరించనుండగా, గ్రోవ్, మీషో, ఫోన్‌పే, బోట్, వీవర్క్ ఇండియా, లెన్స్‌కార్ట్, షాడోఫాక్స్, ఫిజిక్స్ వాలా ఉన్నాయి.