Gold Price | హైదరాబాద్, ఏప్రిల్ 6: బంగారం సామాన్యుడికి అందనంటున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. రోజుకొక రికార్డు బద్దలు కొడుతున్న గోల్డ్ ధర శనివారం మరో మైలురాయి రూ.71 వేలు అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు పుంజుకోవడంతో దేశీయంగా భగభగమండుతున్నది. ఇదే క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ కలిగిన పదిగ్రాముల ధర రూ.1,200 ఎగబాకి రూ.64,150 నుంచి రూ.65,350కి చేరుకున్నది. అలాగే 24 క్యారెట్ కలిగిన 99.9 స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.1,310 అధికమై రూ.71,290 పలికింది. ఒకేరోజు ఇంతటి స్థాయిలో పెరగడం విశేషం. ఇదిలావుంటే ఢిల్లీలో తులం ధర రూ.1,310 ఎగబాకి రూ.71,440 పలికింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెండ్లిళ్ల సీజన్ అయినప్పటికీ కొనుగోళ్లు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. అవసరం ఉంటే తప్పా కొనుగోళ్లు చేయడం లేదని బంగారం వ్యాపారి ఒకరు తెలిపారు.
బంగారంతోపాటు వెండి పరుగులు పెడుతున్నది. హైదరాబాద్లో కిలో వెండి ఏకంగా రూ.2 వేలు అధికమై రూ.85 వేల నుంచి రూ.87 వేలకు చేరుకున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఢిల్లీలో వెండి రూ.83,500 పలికింది. శుక్రవారంతో పోలిస్తే రూ.1,800 పెరిగినట్లు అయింది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్ వర్తకులు వెల్లడిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలివ్వడం, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణం.