న్యూఢిల్లీ, మార్చి 20: కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. ఫిబ్రవరి నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి మూడు నెలల కనిష్ఠానికి తాకుతూ 2.3 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 3.4 శాతంతో పోలిస్తే భారీగా పడిపోయినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తుల్లో వృద్ధి భారీగా పడిపోవడం వల్లనే నెమ్మదించాయని పేర్కొంది.
కానీ, ఎరువులు 3.4 శాతం, సిమెంట్ 9.3 శాతం, విద్యుత్ 0.5 శాతం చొప్పున వృద్ధిని సాధించడంతోపాటు బొగ్గు, స్టీల్ రంగాలు కూడా రికార్డు స్థాయిలో వృద్ధిని కనబరిచినప్పటికీ మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడం విశేషం. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలానికిగాను కీలక రంగాల్లో వృద్ధి కూడా 2.9 శాతానికి జారుకున్నది.
అంతక్రితం ఏడాది ఇది 4.4 శాతంగా ఉన్నది. ఈ సందర్భంగా ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ మాట్లాడుతూ..పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కీలక రంగాల్లో నిస్తేజం నెలకొన్నదని, పారిశ్రామిక ప్రగతి కూడా 4 శాతానికి పరిమితమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.