Vijay Mallya | బెంగళూరు : విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కన్నా ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకున్నాయని ఆరోపించారు.
తాను బ్యాంకులకు రూ.6,200 కోట్లు బాకీ ఉన్నానని, తన నుంచి రూ.10,200 కోట్లు రాబట్టుకున్నాయని తెలిపారు. తనతోపాటు, యునైటెడ్ బ్రీవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్, ప్రస్తుతం లిక్విడేషన్లో ఉంది), ఇతర సర్టిఫికెట్ రుణగ్రస్థుల నుంచి రాబట్టుకున్న సొమ్ము వివరాలను తెలియజేయాలని కోరారు. తన నుంచి రూ.14,000 కోట్లు రాబట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలిపారని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, బ్యాంకులకు నోటీసు జారీ చేసింది. ఈ నెల 13 నాటికి సమాధానం చెప్పాలని ఆదేశించింది. మాల్యా ఈ పిటిషన్ను ఈ నెల 3న దాఖలు చేశారు.