న్యూఢిల్లీ, ఆగస్టు 28: భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రాబోతున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) డిజిటల్ సర్వీసెస్ విభాగం.. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ప్రతిపాదనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సమాచారం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు అందింది. ఈ ఏడాది జూన్‌లో ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి జియో తమ డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఐపీవో ప్రక్రియలో సెబీ ఆమోదమే కీలకం. ఆ తర్వాత సెబీ నిబంధనలకు లోబడి పబ్లిక్ ఇష్యూ పనులను కంపెనీలు మొదలుపెట్టవచ్చు. కాగా, ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా 3.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.37,700 కోట్లు)ను జియో సమీకరించనున్నది. దీంతో ఇప్పుడు హ్యుందాయ్ పేరిట ఉన్న భారతీయ అతిపెద్ద ఐపీవో (3.3 బిలియన్ డాలర్లు) రికార్డు కనుమరుగుకానున్నది. నిజానికి నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీవో రూ.30,000 కోట్లతో రాబోతున్నది. వచ్చే నెల ద్వితీయార్ధంలో ఉండొచ్చని అంచనా. కానీ ఇదికూడా జియో కంటే చిన్నదే. ఇదిలావుంటే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం.. జియో ప్లాట్‌ఫామ్స్ 27 కోట్లదాకా ఫ్రెష్ ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది.
ఇవి ఇష్యూ తర్వాత కంపెనీ మొత్తం ఈక్విటీ బేస్‌లో దాదాపు 2.9 శాతానికి సమానం. ఇక సంస్థ విలువను సుమారు 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. కాగా, సాధారణ కార్పొరేట్ అవసరాలకేగాక జియో ప్లాట్‌ఫామ్స్ మెటీరియల్ సబ్సిడరీ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌కు సంబంధించిన కొన్ని బకాయిలను పాక్షికంగాగానీ, పూర్తిస్థాయిలోగానీ చెల్లించేందుకు ఐపీవో నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది జూన్ ఆఖరునాటికి జియో ఇన్ఫోకామ్ సబ్‌స్ర్కైబర్లు 53.3 కోట్లకుపైనే ఉన్నారు. చైనా మొబైల్ తర్వాత వినియోగదారుల ఆధారంగా ప్రపంచంలో ఇదే రెండో అతిపెద్ద సంస్థ కావడం విశేషం.
జియో ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందన్న అంచనాలున్నాయి. దేశీయ టెలికాం మార్కెట్లో ఇప్పుడు జియోదే హవా అన్న సంగతి విదితమే. కన్సాలిడేషన్ మోడ్‌లో ఉన్న టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మినహా ఉన్నవి మూడే ప్రైవేట్ రంగ కంపెనీలు. అందులో వొడాఫోన్ ఐడియా కంటే ఎయిర్‌టెల్‌తోనే జియోకు గట్టి పోటీ. ఇక 5జీ నెట్వర్క్ విస్తరణ, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు సైతం దేశీయ టెలికాం కంపెనీలకు మదుపర్లలో డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఈ క్రమంలో జియో పబ్లిక్ ఇష్యూ వైపే ఇప్పుడు మదుపర్ల చూపంతా ఉన్నదని చెప్పకతప్పదు.
