న్యూఢిల్లీ, జూన్ 17: కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.349తో కస్టమర్లు ఈ ప్యాక్‌ను పొందవచ్చును. ఈ ప్యాక్ కింద 28 రోజుల పాటు అపరిమిత 5జీ సేవలు, ఇంటికి 50 రోజుల పాటు ఉచిత జియోఫైబర్/ఎయిర్పైబర్ ట్రయల్ కనెక్షన్(టీవీ+వైఫై+ఓటీటీ యాప్‌లు), 50 జీబీ ఉచిత జియో క్లౌడ్ స్టోరేజీ, 4కే నాణ్యతతో టీవీ/మొబైల్లో 90 రోజులపాటు ఉచితంగా జియో హాట్‌స్టార్‌ను తిలకించవచ్చును. ఈ ప్రయోజనాలకు ఒకే ఆఫర్లో అందించడం ద్వారా కొత్త వినియోగదారులకు డిజిటల్ అనుభవాన్ని సులభతరం చేయడం జియో లక్ష్యంగా పెట్టుకున్నది.
మారిన డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువులు ; స్టాక్ ఎక్సేంజీలకు సెబీ అనుమతి
న్యూఢిల్లీ, జూన్ 17: బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఈక్విటీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువులు మారుతున్నాయి. ఈ మేరకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ నుంచి అనుమతులు అందుకున్నట్టు మంగళవారం ఆయా స్టాక్ ఎక్సేంజ్‌లు వేర్వేరు ప్రకటనల్లో తెలియజేశాయి. ఎన్ఎస్ఈ ఈక్విటీ డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల గడువు మంగళవారానికి, బీఎస్ఈది గురువారానికి మార్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అన్ని నూతన ఈక్విటీ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు ఈ కొత్త షెడ్యూలే వర్తించనున్నది. కాగా, ప్రస్తుతం బీఎస్ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) గడువు మంగళవారం, ఎన్ఎస్ఈది గురువారంగా ఉన్నాయి.