న్యూఢిల్లీ, మే 23: దేశీయ ఐపీవో స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోకి సిద్ధమవుతున్న ముకేశ్ అంబానీ ఈ నిర్ణయాన్ని వాయిదావేసుకున్నట్టు తెలుస్తున్నది. గత కొన్ని నెలలుగా వాయిదాపడుతూ వచ్చిన డిజిటల్ సేవల సంస్థ జియో ఐపీవో మళ్లీ వాయిదాపడినట్టు తెలుస్తున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా రాజకీయ భౌగోళిక పరిస్థితులు, మార్కెట్లలో అస్థిరత వల్ల ఐపీవోపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నది. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం, మూలధన పెట్టుబడులు తరలిపోతుండటంతో బహుళ వ్యాపారం నిర్వహిస్తున్న రిలయన్స్ ఈ ఐపీవోపై నిర్ణయం తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నది. ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులు తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపుతాయన్న అంచనా, పెట్టుబడుల రాబడులపై కూడా ప్రభావం చూపుతాయన్న అనుమానం సంస్థలో నెలకొన్నది. అయినప్పటికీ ఈ ఐపీవోపై స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నట్టు కంపెనీకి సంబంధించిన ఉన్నత వర్గాలు సూచనప్రాయంగా చెప్పారు.