Reliance Jio | ముంబై, జనవరి 2: భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రాబోతున్నది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. ఏకంగా రూ.35,000-40,000 కోట్ల ఐపీవోకు వస్తున్నట్టు తెలుస్తున్నది. అధినేత అంబానీ ఈ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇప్పటిదాకా హ్యుందాయ్ పేరిట ఉన్న భారీ ఐపీవో (రూ.27,870 కోట్లు) రికార్డు త్వరలోనే కనుమరుగైనట్టే. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన హ్యుందాయ్ పబ్లిక్ ఇష్యూనే ప్రస్తుతం దేశంలో వచ్చిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ర్లలో అతిపెద్దదిగా ఉన్నది.
ఈ ఏడాది జూలై-డిసెంబర్లో జియో ఐపీవో రావచ్చన్న అంచనాలున్నాయి. ఇక సంస్థ విలువ రూ.10 లక్షల కోట్లపైనే (120 బిలియన్ డాలర్లు) ఉంటుందని లెక్కిస్తున్నారు. అమ్మకానికి ప్రస్తుత షేర్లు, కొత్త షేర్లు రెండూ పెట్టవచ్చని సమాచారం. ప్రధాన ఇన్వెస్టర్ల కోసం ఇప్పటికే ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్ కోసం చర్చలు కూడా మొదలయ్యాయి. కాగా, నిరుడు జూలైలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జెఫ్రీస్.. ఈ ఏడాది 112 బిలియన్ డాలర్ల విలువతో రిలయన్స్ జియో ఐపీవో వస్తుందని చెప్పిన సంగతి విదితమే. ఇదిలావుంటే గడిచిన పదేండ్లలో తొలిసారి గత ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్లు మదుపరులకు నష్టాలను మిగిల్చాయి. 2024లో ఆర్ఐఎల్ షేర్ విలువ దాదాపు 6 శాతం పడిపోయింది. అయినప్పటికీ జియో ఐపీవోకు ముకేశ్ అంబానీ సిద్ధమవుతుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
గత ఏడాది జూలైలో టెలికం సంస్థలు మొబైల్ టారీఫ్ చార్జీలను పెంచాయి. అయితే ఈ నిర్ణయం జియోసహా మిగతా అన్ని సంస్థలనూ దెబ్బతీసింది. జూలై నుంచి అక్టోబర్ వరకు జియో కస్టమర్లు సుమారు 1.65 కోట్లు తగ్గిపోయారు. అయినప్పటికీ దేశీయంగా జియో కస్టమర్లే ఇప్పటికీ ఎక్కువ. వినియోగదారులపరంగా జియో మార్కెట్ వాటా 40 శాతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో పోయిన కస్టమర్లను తిరిగి ఆకట్టుకునేందుకు మార్కెట్లో ధరల యుద్ధం చోటుచేసుకోవచ్చని, ఇది ఏఆర్పీయూ (ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం)ను ప్రభావితం చేయవచ్చని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే జియో ఐపీవోపై ఈ పరిస్థితుల ప్రభావం తప్పక ఉంటుందని కూడా వారు విశ్లేషిస్తున్నారు.