న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : కార్పొరేట్లతోపాటు ఆడిట్ నివేదిక అవసరమున్న ఖాతాదారుల కోసం ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలు గడువును ఆదాయ పన్ను శాఖ బుధవారం పొడిగించింది. 2025-26 మదింపు సంవత్సరానికిగాను ఈ ఏడాది డిసెంబర్ 10దాకా ఐటీఆర్‌లను ఫైలింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఐటీ చట్టాల ప్రకారం అక్టోబర్ 31లోగా కార్పొరేట్లు, ఖాతా పుస్తకాల ఆడిటింగ్ అవసరమున్న ట్యాక్స్‌పేయర్స్ తమ ఐటీఆర్‌లను దాఖలు చేయాల్సి ఉన్నది. అయితే దీనికి మరో నెల 10 రోజుల అదనపు సమయం ఇస్తున్నామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటనలో తెలియజేసింది. అలాగే నవంబర్ 10వరకు ఆడిట్ చేసిన నివేదికను పన్ను చెల్లింపుదారులు ఫైల్ చేయవచ్చన్నది. కాగా, గత నెల సెప్టెంబర్ 16తోనే వ్యక్తిగత ఐటీఆర్ దాఖలుకున్న గడువు ముగిసిన విషయం తెలిసిందే. 7.54 కోట్లకుపైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.
వార్షిక ఆదాయం రూ.50 లక్షలదాకా ఉన్న వ్యక్తుల కోసం ఆదాయ పన్ను (ఐటీ) రేట్లను భారీగా తగ్గించాలంటూ బుధవారం పారిశ్రామిక సంఘం పీహెచ్‌డీసీసీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు రెవిన్యూ కార్యదర్శి అర్వింద్ శ్రీవాత్సవకు తమ ముందస్తు బడ్జెట్ సిఫారసులను సమర్పించింది. ఏటా రూ.50 లక్షల ఆదాయం దాటితేనే గరిష్ఠంగా వ్యక్తిగత ఆదాయ పన్ను 30 శాతం వేయాలన్నది. ప్రస్తుతం కొత్త ఆదాయ పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ.24 లక్షలు దాటితే 30 శాతం ఆదాయ పన్ను పడుతున్న సంగతి విదితమే. కాగా, రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ వర్గాల నుంచి సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం కోరుతున్నది. దీంతో వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబులకు సంబంధించి వార్షిక ఆదాయం రూ.30 లక్షలదాకా 20 శాతం, రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలదాకా 25 శాతం, రూ.50 లక్షలపై 30 శాతం పన్నులు పడేలా శ్లాబులను సవరించాలని పీహెచ్‌డీసీసీఐ కోరుతున్నది.